ఇంటి చాకిరీ, వంట వార్పులతో పాటు కుటుంబ సభ్యుల అవసరాలను చూసుకునే గృహిణుల శ్రమకు సుప్రీంకోర్టు కొత్త విలువ కట్టింది. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ కోటీశ్వర సింగ్‌ల ధర్మాసనం ఈ మేరకు చారిత్రాత్మక తీర్పు ఇస్తూ, గృహిణులు కేవలం ఇల్లాలు కాదని, దేశ పురోగతికి పరోక్షంగా సహకరించే నిర్మాతలని పేర్కొంది. ఇకపై రోడ్డు ప్రమాదాల్లో మరణించిన గృహిణుల క్లెయిమ్‌లలో 'లాస్ ఆఫ్ డొమెస్టిక్ కేర్' కింద నెలకు కనీసం రూ.30,000 బేస్ ఇన్‌కమ్‌గా పరిగణించాలని, ఈ మొత్తాన్ని ప్రతి మూడేళ్లకు ఒకసారి 10 శాతం చొప్పున పెంచుకోవాలని స్పష్టం చేసింది.

పంజాబ్‌కు చెందిన ఒక పాతకేసు అప్పీలు విచారణ సందర్భంగా వెలువడిన ఈ తీర్పు, 2001లో జరిగిన ప్రమాదంలో మరణించిన మహిళకు రూ.62.77 లక్షల పరిహారాన్ని మంజూరు చేసింది. గతంలో నైపుణ్యం లేని కూలీల వేతనాల ఆధారంగా నామమాత్రపు మొత్తాలనే ఇచ్చే పాత పద్ధతిని తిరస్కరించిన కోర్టు, ఇది 'ప్రణయ్ సేథీ' కేసు పరిమితులకు అదనంగా ఉంటుందని వివరించింది. గృహిణుల చెల్లింపు లేని సేవల విలువను గుర్తించే దిశగా అమెరికాలోని ఆంటోయినెట్ బ్రౌన్ బ్లాక్‌వెల్ నుంచి రాబిన్‌వెస్ట్ వరకు పలువురు చేసిన పోరాటాలకు, ఎన్‌ఎస్‌ఒ 2019 నివేదికల్లోని గణాంకాలకు ఈ తీర్పుతో న్యాయపరమైన గుర్తింపు దక్కినట్లైంది.