స్విఫ్ట్‌లెట్ అనే చిన్న పక్షి నిర్మించే గూడు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సహజసిద్ధమైన ఉత్పత్తుల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. సాధారణంగా పక్షులు పుల్లలు, గడ్డి లేదా ఆకులతో గూళ్లు కట్టుకుంటే, ఈ పక్షి మాత్రం కేవలం తన నోటి లాలాజలాన్ని ఉపయోగించి గూడు తయారు చేస్తుంది. చీకటి గుహల గోడలు లేదా ఎత్తైన కొండ చరియలపై ఈ లాలాజలాన్ని పదే పదే రాసి, గాలికి గట్టిపడేలా చేసి చివరికి గిన్నె ఆకారంలో గూడును సిద్ధం చేస్తుంది.
ఈ గూళ్లను సేకరించడం అత్యంత ప్రమాదకరమైన పని. పక్షులు దట్టమైన చీకటి గుహల్లో లేదా వందల అడుగుల ఎత్తున ఉండే కొండలపై మాత్రమే గూళ్లు కడతాయి. సేకరించే వ్యక్తులు తాడులు, వెదురు నిచ్చెనల సహాయంతో ప్రాణాలను పణంగా పెట్టి ఆ ఎత్తులకు చేరుకుంటారు. చిన్న పొరపాటు జరిగినా ప్రాణాలు పోయే ప్రమాదం ఉండటంతో ఈ పనిని అత్యంత రిస్క్‌గా భావిస్తారు.
ముఖ్యంగా చైనా, హాంకాంగ్, మలేషియా, సింగపూర్ వంటి దేశాల్లో ఈ గూళ్లకు విపరీతమైన డిమాండ్ నెలకొంది. అక్కడ వీటిని విలాసవంతమైన, పోషక విలువలున్న ఆహారంగా పరిగణిస్తారు. ఈ గూళ్లతో తయారయ్యే 'బర్డ్ నెస్ట్ సూప్'ను అత్యంత సంపన్నులు తినే స్టార్ హోటల్స్ లగ్జరీ మెనూలో ఉంచుతారు. ఈ సూప్ తాగితే శరీరానికి అపారమైన శక్తి లభిస్తుందని, యవ్వనంగా ఉంటారని స్థానికులు నమ్ముతారు. నాణ్యతను బట్టి అంతర్జాతీయ మార్కెట్‌లో ఈ గూళ్లు కిలోకు వేల డాలర్లు పలుకుతున్నాయి.
పెరుగుతున్న డిమాండ్ కారణంగా ఆగ్నేయాసియా దేశాల్లో ఇది పెద్ద వ్యాపారంగా మారింది. పక్షుల జనాభాకు నష్టం కలగకుండా ఉండేందుకు సహజ గుహలతో పాటు, పక్షులను ఆకర్షించడానికి ప్రత్యేక భవనాలను కూడా నిర్మిస్తున్నారు. అయితే, అతిగా సేకరిస్తే పక్షుల మనుగడకే ప్రమాదం కలుగుతుందని గుర్తించిన అనేక దేశాలు గూళ్ల సేకరణపై కఠినమైన నిబంధనలు అమలు చేస్తున్నాయి.







