తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు కొత్త రూపం సంతరించుకుంటూ నిరంతరం కొనసాగుతున్నాయి. నల్గొండ, మెదక్, వరంగల్ జిల్లాల్లోనూ, ముఖ్యంగా బీఆర్‌ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లోనూ పాత, కొత్త నేతల మధ్య ఘర్షణలు ముదురుతున్నాయి. సమన్వయం, పదవుల పంపకంపై ఇచ్చిన హామీలు అమలు కావడం లేదన్న అసంతృప్తి కార్యకర్తల్లో పెరగడంతో, తాజాగా జహీరాబాద్ నాయకులు గాంధీభవన్‌లో ఆందోళన నిర్వహించారు.
గతంలో జహీరాబాద్ నుంచి మాజీ మంత్రి గీతారెడ్డి ప్రాతినిధ్యం వహించగా, తాజా ఎన్నికల్లో పార్టీ అధిష్టానం మాజీ మంత్రి చంద్రశేఖర్‌కు టిక్కెట్ కేటాయించింది. దీంతో రెండు వర్గాల మధ్య పోరు ముదిరి, పాత నేతలను పక్కనబెట్టి కొత్తవారికి పదవులు ఇస్తున్నారన్న ఆరోపణలతో నియోజకవర్గ నాయకులు పీసీసీ అధ్యక్షుడు మహేష్‌గౌడ్ ఛాంబర్ ముందు నిరసన తెలిపారు. ఇదివరకు ఖమ్మం జిల్లా, హైదరాబాద్ పార్లమెంట్ నేతల సమావేశాల్లోనూ ఇలాంటి సమన్వయ లోపమే కనిపించిందని, అధిష్టానం వెంటనే స్పందించకపోతే పార్టీకి నష్టం జరుగుతుందని హెచ్చరికలు వినిపిస్తున్నాయి.






