హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 విస్తరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సరైన సహకారం అందించడం లేదని, ప్రతిపాదనల ఆమోదంలో అంతులేని జాప్యం జరుగుతోందని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి నేరుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని, తెలంగాణ ప్రయోజనాల కోసం ఢిల్లీపై ఒత్తిడి తీసుకురావడంలో ఆయన విఫలమయ్యారని, అడుకుంటున్నారని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. దీనికి ప్రతిగా కిషన్ రెడ్డి, ఫేజ్-2కు కేంద్రం ఆమోదం తెలుపుతుందని, కొన్ని పద్ధతులు పాటించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
రాజకీయ లబ్ధి కోసమే రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కేంద్రంపై నెపం మోపుతున్నారని బీజేపీ నాయకులు మండిపడుతున్నారు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ కూడా ఇలాగే కేంద్రంపై వివక్ష ఆరోపణలు చేసి డైవర్షన్ సృష్టించారని, అప్పుడు బీఆర్ఎస్‌ను నమ్మని ప్రజలే ఇప్పుడు రేవంత్ రెడ్డి మాటలను కూడా నమ్మరని కాషాయ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. గ్రేటర్ పరిధిలోని మూడు కార్పొరేషన్ల ఎన్నికల సమయంలో మెట్రో ప్రాజెక్ట్ కేవలం రవాణా సాధనంగా కాకుండా, రెండు జాతీయ పార్టీల మధ్య రాజకీయ మైలేజ్ సాధించే అస్త్రంగా మారిపోయినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.






