న్యూఢిల్లీ: వచ్చే ఆరేళ్లలో అంటే 2031 నాటికి భారత్‌లో 5జీ వినియోగదారుల సంఖ్య 110 కోట్లకు చేరుకుంటుందని ఎరిక్సన్‌ రూపొందించిన నివేదిక వెల్లడించింది. అప్పటికి మొత్తం మొబైల్‌ కనెక్షన్లలో 5జీ వాటా 81 శాతంగా ఉంటుందని, ప్రస్తుతం 46 శాతం వాటాతో ప్రధాన టెక్నాలజీగా కొనసాగుతున్న 4జీ వినియోగం మాత్రం 57 కోట్ల నుంచి 16 కోట్లకు పడిపోతుందని పేర్కొంది. 2025 చివరి నాటికి దేశీయంగా 5జీ వినియోగదారులు 43 కోట్లకు చేరగా, మొత్తం సబ్‌స్క్రిప్షన్లలో వాటా 35 శాతానికి చేరిందని ఈ నివేదిక స్పష్టం చేసింది.

డివైజ్‌లు చౌకగా లభించడం, నెట్‌వర్క్‌ కవరేజీ విస్తృతమవడం తోడు ఫిక్సిడ్‌ వైర్‌లెస్‌ యాక్సెస్‌ (ఎఫ్‌డబ్ల్యూఏ) సేవలు అందుబాటులోకి రావడంతో 5జీ వినియోగం భారీగా పెరుగుతోందని ఎరిక్సన్‌ ఇండియా ఎండీ నితిన్‌ బన్సల్‌ తెలిపారు. ప్రతి స్మార్ట్‌ఫోన్‌పై నెలవారీ డేటా వినియోగం ప్రస్తుతం సగటున 37 జీబీగా ఉండగా, 2031 నాటికి ఇది 70 జీబీకి చేరుకుంటుందని, అంతర్జాతీయంగా 5జీ సబ్‌స్క్రిప్షన్లు 2031 నాటికి 640 కోట్లకు పెరుగుతాయని నివేదిక అంచనా వేసింది.