వియత్నాం దేశంలోని ఓ పొలం గట్టుపై నిలబడి ఉన్న వ్యక్తి ఎదురుగా భారీ పాము ఒక్కసారిగా పైకి లేచింది. పడగవిప్పి బుసలు కొడుతూ దాడికి దిగిన పామును ఆ వ్యక్తి ఏమాత్రం భయపడకుండా తన కుడికాలితో బలంగా తన్నాడు. దీంతో ఆ పాము కాస్త దూరంలో వెళ్లి పడింది.

అయితే పాము తగ్గకుండా తీవ్రమైన కోపంతో మరింత వేగంగా బుసలు కొడుతూ మళ్లీ ఆ వ్యక్తిపైకి దూసుకొచ్చింది. అప్పుడు కూడా ఆ వ్యక్తి తడుముకోకుండా రెండోసారి దాన్ని కాలితో గాల్లోనే తన్నాడు. పాము కాటేయడానికి ముందుకు రావడం, ఆ వ్యక్తి దాన్ని ఫుట్‌బాల్‌లా తన్నడం వరుసగా సాగాయి.

ఈ భయంకరమైన దృశ్యాలను అక్కడే ఉన్న కొందరు వ్యక్తులు కెమెరాలో రికార్డు చేసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌ను ఊపేస్తూ విస్తృతంగా వ్యాపించింది. వీడియో చూసిన నెటిజన్లు ఆ వ్యక్తి ధైర్యానికి ఆశ్చర్యపోతున్నారు.

కొందరు నెటిజన్లు 'ఇతను మనిషా లేక యముడా? పాముతో ఆడుకోవడం ఏంటి' అని కామెంట్స్ పెడుతుంటే, మరికొందరు 'చిన్న తప్పు జరిగినా ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది, ఇలాంటి ప్రాణాంతక స్టంట్స్ చేయకండి' అని హెచ్చరిస్తున్నారు. పాము పేరు చెబితేనే భయపడే మనుషులు ఉండగా, ఇలా పాముతో ఆటలు ఆడటం చూసి అందరూ అవాక్కవుతున్నారు.