రష్యా ఎయిర్‌ఫోర్స్‌లో అత్యంత శక్తివంతమైనదిగా పేరుగాంచిన Tu-22M3 బాంబర్ విమానం సోమవారం ట్రైనింగ్ సెషన్‌లో ఉండగానే ఇర్కుట్స్క్ ప్రాంతంలో కుప్పకూలింది. సాంకేతిక లోపం కారణంగా సంభవించిన ఈ ప్రమాదంలో విమానం నది సమీపంలో నేలను ఢీకొట్టింది. అయితే, విమానం భూమిని తాకేలోపే అందులో ఉన్న నలుగురు పైలట్లు పారాచూట్ల సహాయంతో కిందకు దూకి ప్రాణాలతో తప్పించుకున్నారు. ఈ దృశ్యాలను స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పంచుకోగా, అందులో విమానం కూలిన వెంటనే దట్టమైన పొగ అలుముకోవడం స్పష్టంగా కనిపించింది.

ఈ ఘటనపై రష్యన్ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ప్రమాద సమయంలో విమానంలో యుద్ధ సామాగ్రి లేదని, కూలిన ప్రాంతంలో జనసాంద్రత లేకపోవడంతో ఆస్తి, ప్రాణ నష్టం చోటు చేసుకోలేదని స్పష్టం చేసింది. విమాన ఇంజన్ వైఫల్యమే ఈ ప్రమాదానికి కారణమయ్యే అవకాశం ఉందని, దీనిపై దర్యాప్తు కొనసాగుతోందని మంత్రిత్వ శాఖ తెలిపింది. పైలట్ల ప్రాణాలకు ఎలాంటి ముప్పు లేదని అధికారులు నిర్ధారించారు.