ముంబైకి నీరు అందించే ఏడు ప్రధాన జలాశయాల్లో (అప్పర్ వైతర్ణా, మోడక్ సాగర్, తన్సా, మిడిల్ వైతర్ణా, భత్సా, విహార్, తులసి) నిల్వలు ప్రమాదకర స్థాయికి చేరాయి. రుతుపవనాలు రాకపోవడంతో జూన్ 16 నాటికి ఈ నిల్వలు కేవలం 10.35 శాతానికి పడిపోయాయని బీఎంసీ మంగళవారం విడుదల చేసిన సర్క్యులర్‌లో పేర్కొంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అమల్లో ఉన్న 10 శాతం కోతను కొనసాగిస్తూ, పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు, క్రీడా క్లబ్‌లకు అందించే నీటిపై 20 శాతం కట్ చేసింది. కొత్త నిర్మాణ ప్రాజెక్టులకు కనెక్షన్లు ఇవ్వబోమని, ఉన్న తాత్కాలిక కనెక్షన్లను వెంటనే తెంచేస్తున్నట్లు స్పష్టం చేసింది.

తాగునీటితో కార్లు శుభ్రం చేసుకోవడం, తోటలకు నీరు పెట్టడం, రోడ్లు కడగడంపై పూర్తి నిషేధం విధించగా, ఈ పనులకు బోర్‌వెల్లు లేదా బావుల నీటిని వాడాలని ప్రజలకు సూచించింది. నగరంలోని స్విమ్మింగ్ పూల్‌లకు సరఫరా ఆపేసి, ప్యాకేజ్డ్ మరియు మినరల్ వాటర్ యూనిట్లపై ఆంక్షలు పెట్టింది. వెస్ట్రన్ రైల్వే, సెంట్రల్ రైల్వే, ఆర్‌సీఎఫ్, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, ఎంఐడీసీ, భారత నౌకాదళం వంటి సంస్థలు తప్పనిసరిగా శుద్ధి చేసిన లేదా రీసైకిల్ చేసిన నీటిని మాత్రమే వినియోగించాలని ఆదేశించింది. నీటిని వృథా చేస్తే జరిమానా విధిస్తామని బీఎంసీ హెచ్చరించింది.