డెహ్రాడూన్‌లోని చంద్రబాని నివాసితురాలు, 23 ఏళ్ల రియా కుమారి థాపా తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. 12వ తరగతిలో 97.6 శాతం మార్కులతో ప్రథమ స్థానం సాధించిన ఈమె, ట్యూషన్లు చెప్పుకుంటూ తన ఖర్చులు భరించుకునేది. కార్గిల్ యుద్ధంలో పోరాడిన తండ్రి, గృహిణి అయిన తల్లి కలిగిన రియా.. మొదటిసారి నీట్‌లో విఫలమైనా 2026లో జరిగే పరీక్షలో తప్పకుండా పాసవుతానని కుటుంబ సభ్యులకు, చుట్టుపక్కల వారికి ధైర్యం చెప్పింది.
రాత్రి పొద్దుపోయే వరకు చదువుకున్న రియా ఉదయం గది తలుపు తెరవకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. తండ్రి తలుపు తెరిచి చూడగా ఆమె ఉరితాడుకు వేలాడుతూ కనిపించింది. ఘటనా స్థలం నుంచి 'అమ్మా, నాన్నా, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఇందులో ఎవరిదీ తప్పు లేదు' అని రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పరీక్ష రద్దు కావడంతో బెంగ పెట్టుకున్న రియా మరణంతో కుటుంబంలో, స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.








