రాష్ట్రపతి జన్మదినం సందర్భంగా ఆమె సొంత జిల్లా మయూర్‌భంజ్‌లోని రాయరంగపూర్‌లో ఈ నెల 20న చారిత్రాత్మక బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కూడా వస్తుండగా, ఇద్దరు అగ్ర నాయకులు ఒకే వేదికపై ప్రసంగించడం విశేషంగా మారింది. ఈ సందర్భంగా ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న రైల్వే ప్రాజెక్టు, మెగా కోల్‌ గ్యాసిఫికేషన్‌ ప్రాజెక్టుతో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి, ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నారు.

ఈ ఉన్నత స్థాయి పర్యటన విజయవంతం కావడానికి స్థానిక లోక్‌ సేవా భవన్‌లో మంగళవారం ముఖ్యమంత్రి మోహన్‌ చరణ్‌ మాఝీ అధ్యక్షతన సమీక్ష జరిగింది. బ్లూప్రింట్‌ను పరిశీలించిన ముఖ్యమంత్రి, వీవీఐపీల రాకపోకలు మరియు భారీ సభలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశానికి ప్రకాష్‌ మిశ్రా, అనూ గర్గ్‌, యోగేష్‌ బహదూర్‌ ఖురానియా, డీకే సింగ్‌, శాశ్వత్‌ మిశ్రా, హేమంత్‌ శర్మ, బినయతోష్‌ మిశ్రా తదితర ఉన్నతాధికారులు హాజరయ్యారు.