ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం కింద నిధులను ఈ నెలాఖరులోపే లేదా జులై మూడో వారంలో విడుదల చేయనుంది. ఈ మేరకు ఉండవల్లిలోని తన నివాసంలో ఉన్నతాధికారులతో సమావేశమైన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, అర్హులైన విద్యార్థులకు త్వరితగతిన ఆర్థికసాయం అందేలా చూడాలని ఆదేశించారు.
రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభమైన నేపథ్యంలో ఈ పథకాన్ని వేగవంతం చేయాలని మంత్రి సూచించారు. తల్లికి వందనం పథకం అమలుకు సంబంధించి ప్రస్తుతం తల్లుల ఆధార్ ధ్రువీకరణ (ఆధార్ వెరిఫికేషన్) ప్రక్రియ కొనసాగుతోందని, ఇది పూర్తయిన వెంటనే నిధులు విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ పథకం ద్వారా మొత్తం రూ.15వేల ఆర్థికసాయం అందించనుండగా, అందులో రూ.13వేలు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు. మిగిలిన రూ.2వేలు విద్యార్థులు చదువుకుంటున్న పాఠశాల ఖాతాలో వేయనున్నారు. పాఠశాలల్లో విద్యార్థుల చేరిక శాతాన్ని పెంచేందుకు కూడా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులకు సూచించారు.
ఈ సమావేశంలో బడి పిలుస్తోంది, షైనింగ్ స్టార్స్, మెగా పీటీఎం (తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల సమావేశం), యోగాంధ్ర, టెట్ (ఉపాధ్యాయ అర్హత పరీక్ష) నిర్వహణ వంటి ఇతర కీలక అంశాలపై కూడా చర్చించారు. అధికారులు ఈ అంశాలపై మంత్రికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరణ ఇచ్చారు.






