భువనేశ్వర్‌లోని పూరీ బ్లూ ఫ్లాగ్ బీచ్‌లో స్నానం చేస్తున్న చత్తీస్‌గఢ్ పర్యాటకుడు పియూష్ కుమార్ బలమైన అలలకు కొట్టుకుపోయాడు. ఘటన గమనించిన లైఫ్‌గార్డ్ వెంటనే నీటిలోకి దూకి బాలుడిని ఒడ్డుకు చేర్చి పూరీ జిల్లా ప్రధాన ఆసుపత్రికి తరలించగా, వైద్యులు అతడు మరణించినట్లు నిర్ధారించారు. మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగిస్తామని పోలీసులు తెలిపారు.

సుందర్‌గఢ్ జిల్లా 10వ నంబర్ జాతీయ రహదారి కొంయితర సమీపంలో ఝార్సుగుడ, సుందర్‌గఢ్ వైపుల నుంచి వస్తున్న రెండు ట్రాలర్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఒక ట్రాలర్ డీజిల్ ట్యాంక్ పగలడంతో చెలరేగిన మంటల్లో ఇద్దరు డ్రైవర్లు సజీవ దహనమయ్యారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసినప్పటికీ, వాహనాలు పూర్తిగా కాలిపోవడంతో మృతుల వివరాలు తెలియాల్సి ఉందని, దర్యాప్తు కొనసాగుతోందని భస్మ ఠాణా పోలీసులు పేర్కొన్నారు.