మార్చి నెలలో ఏఐ ప్రాజెక్టులను వేగవంతం చేసేందుకు మెటా 'అప్లైడ్ ఏఐ' అనే కొత్త విభాగాన్ని ఏర్పాటు చేసి, సుమారు 6,500 మంది ఇంజనీర్లు, ప్రొడక్ట్ మేనేజర్లను రాత్రికి రాత్రే అక్కడికి బదిలీ చేసింది. రొటీన్ పనులు, పజిల్స్ సృష్టించడం వంటి విధులను బలవంతంగా అప్పగించడంతో ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి చెందారు. కొందరు ఈ పరిస్థితిని రష్యాలోని గులాగ్ ఖైదీల శిబిరాలతో పోల్చారు. ఈ వ్యవహారం వైర్డ్ పత్రిక ద్వారా బయటపడటంతో షాక్‌కు గురైన మెటా యాజమాన్యం, ఉద్యోగులకు భవిష్యత్తు ఆశయాలను, కెరీర్ ప్రయోజనాలను వివరించడంలో ఘోరంగా విఫలమైందని సీటీఓ ఆండ్రూ బోస్వర్త్ బహిరంగంగా క్షమాపణలు చెప్పారు.
గత మే నెలలో ప్రపంచవ్యాప్తంగా 8,000 మందిని తొలగించడం, మరో 7,000 మందిని ఏఐ బృందాల్లోకి మార్చడం, ఉద్యోగుల మౌస్ కదలికలపై నిఘా పెట్టే ప్రయత్నం వంటి చర్యలు నైతిక స్థైర్యాన్ని దెబ్బతీశాయి. నిరసనల నేపథ్యంలో నిఘా కార్యక్రమాన్ని వెనక్కి తీసుకున్న కంపెనీ, ఇకపై ఒక మేనేజర్ కింద 20 మంది మాత్రమే ఉండేలా పరిమితి విధిస్తామని హామీ ఇచ్చింది. ఏఐ సాంకేతికత తెలిసిన వ్యక్తి ఉద్యోగాన్ని లాక్కోవచ్చునని హెచ్చరించిన ఆండ్రూ బోస్వర్త్, ఉద్యోగుల నమ్మకం లేకుండా విజయం సాధ్యం కాదని ఈ సంఘటన నిరూపించిందని అభిప్రాయపడ్డారు.







