కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక ప్రాంతంలో గత 11 రోజులుగా అదృశ్యమైన మూడేళ్ల చిన్నారి జాహ్నవి కేసులో కొత్త పరిణామాలు చోటు చేసుకున్నాయి. పాప తప్పిపోయిన పామాయిల్ తోటలోని కంచెకు రెండు బొమ్మలు వేలాడదీయబడి ఉండటం స్థానికుల్లో ఆందోళన రేపింది. అయితే, ఇది కేస్ సీన్ రీకన్స్ట్రక్షన్‌లో భాగమని తుని రూరల్ పోలీసులు వివరించారు. అటవీ ప్రాంతం కావడంతో క్రూర జంతువుల రాక ఉండవచ్చనే అనుమానంతో, ఆ బొమ్మల్లో చికెన్ ముక్కలను ఎరగా ఉంచినట్లు అధికారులు తెలిపారు.
చిన్నారి ఆచూకీ కోసం పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో కలిపి 200 మందికి పైగా సిబ్బంది 40 ఎకరాల విస్తీర్ణంలోని దట్టమైన తోటలు, అడవులను జల్లెడ పడుతున్నారు. థర్మల్ డ్రోన్లు, రేడియేషన్ డిటెక్టర్ మిషన్లు, జీపీఎస్ ట్రాకింగ్ వంటి అత్యాధున సాంకేతికతలను ఉపయోగించి హనుమాన్ బృందాలు రాత్రింబవళ్లు గాలిస్తున్నా ఇంతవరకు జాడ లభించలేదు. కొండచిలువ లేదా ఇతర మృగాల బారిన పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తుండగా, ఆ ప్రాంతంలో వన్యప్రాణుల సంచారం లేదని అటవీ శాఖ అధికారులు తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో కిడ్నాప్ కోణంలోనూ దర్యాప్తు సాగుతోంది. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత కేసు పురోగతిపై జిల్లా ఎస్పీతో నిత్యం మాట్లాడుతున్నట్లు తెలిపారు. త్వరలోనే బాధిత కుటుంబ సభ్యులు భవాని, గణేష్‌లను కలిసి పూర్తి మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారు. కాగా, సహాయకంగా నిలిచి అకస్మాత్తుగా మృతి చెందిన డాగ్ స్క్వాడ్ కుక్క పోస్ట్ మార్టం నిర్వహించగా, నివేదిక ఒక రోజులో అందుతుందని సమాచారం.







