బెంగళూరులోని బిడది పరిసర గ్రామాల్లోని గోడలపై బీజేపీ, జేడీఎస్ నాయకులను విమర్శిస్తూ పోస్టర్లు కనిపించాయి. ఈ పోస్టర్లలో కేంద్రమంత్రి హెచ్‌డీ కుమారస్వామి, ఆయన కుమారుడు నిఖిల్, భార్య అనితా కుమారస్వామిల ఫోటోలను ముద్రించారు. 'బిడదిలో మాకు 100 ఎకరాల భూమి మాత్రమే ఉంది, ఆ భూమి మాకు వదిలేయండి అనితక్క', 'నేను వినయ్ గౌడ.. మీ ఆస్తులకు బినామి' అంటూ రాశారు. అలాగే బిరియాని అడ్డా నారాయణస్వామి, రైతుల భూములు లాక్కున్న దొంగ, బీజేపీ నేత ఆర్.అశోక్ అని పేర్కొంటూ పోస్టర్లు అతికించారు.
ఈ పోస్టర్లపై కేంద్రమంత్రి హెచ్‌డీ కుమారస్వామి తీవ్రంగా స్పందించారు. తాము బిడది రైతుల కోసం పోరాడుతుంటే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి డీ.కే.శివకుమార్ పాత అలవాట్లు వదలలేదని, ఈ పోస్టర్ల వెనుక ఆయన హస్తం ఉందని పరోక్షంగా విమర్శించారు. సీఎం అయిన తర్వాత బ్లూ ఫిల్మ్‌లు చేయడం, పోస్టర్లు అతికించడం మానేస్తారనుకున్నానని, కానీ ఆ అలవాటును మానుకోలేదని మండిపడ్డారు.
తమ కుటుంబం పేరుతో పోస్టర్లలో రాసిన వివరాలు నిజం కావని కుమారస్వామి స్పష్టం చేశారు. తమ భార్య ఫోటోను పోస్టర్లో వేసి, 100 ఎకరాలు అని రాశారని, కానీ అక్కడ తమకు ఉండేది 46 ఎకరాలు మాత్రమేనని, ఇంక ఏ భూమి లేదని ఆయన తెలిపారు. ఈ వివాదం ప్రాంతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.







