గురువారం రాత్రి ఉక్రెయిన్ రష్యాపై విస్తృత డ్రోన్ దాడికి తెరలేపింది. ఈ ఆకస్మిక దాడిలో రష్యా రాజధాని మాస్కోలోని గాజ్‌ప్రోమ్ నెఫ్ట్ చమురు శుద్ధి కర్మాగారం పూర్తిగా ధ్వంసమైంది. నగర ఆగ్నేయ శివార్లలో జరిగిన ఈ సంఘటనతో భారీ మంటలు చెలరేగాయి. మాస్కో మేయర్ సెర్గీ సోబ్యానిన్ ఈ కర్మాగారంపై అనేక డ్రోన్లు దాడి చేశాయని ధృవీకరించారు. ఇది రాజధాని ప్రాంతానికి అతిపెద్ద ఇంధన సరఫరాదారు కావడం గమనార్హం.
రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం, వాయు రక్షణ వ్యవస్థలు 555 ఉక్రేనియన్ డ్రోన్‌లను కూల్చివేశాయి. అయినప్పటికీ, సుమారు 200 డ్రోన్‌లు మాస్కో సమీపించగా, కొన్ని నగరంపై దాడి సాగించాయి. సదోవోద్ ప్రాంతం, బెలాయా డాచా షాపింగ్ కాంప్లెక్స్‌లు మరియు కొన్ని నివాస భవనాలు ఈ దాడిలో దెబ్బతిన్నాయి. కనీసం రష్యా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా ఈ దాడిని తొలుత గుర్తించలేకపోయింది.
ఈ ఘటన ప్రభావంతో మాస్కోలోని నాలుగు ఎయిర్ పోర్టుల్లో విమాన సర్వీసులను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. ఒకే వారంలో రష్యా ఆయిల్ వ్యవస్థల్ని ఉక్రెయిన్ టార్గెట్ చేయడం ఇది రెండోసారి. పలు ఆయిల్ రిఫైనరీలు ఈ దాడిలో దెబ్బతినగా, చమురు శుద్ధి కర్మాగారాల నుంచి మంటలు ఎగిసిపడుతున్నాయి.
ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్స్కీ ఫ్రాన్స్‌లో జరుగుతున్న జీ 7 (జి7 - ప్రపంచంలోని అభివృద్ధి చెందిన ఏడు దేశాల సమావేశం) సమావేశంలో పాల్గొంటున్న సమయంలోనే ఈ దాడి చోటుచేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మక్రాన్‌తో ఆయన చర్చలు జరిపారు. ప్రపంచ నాయకుల నుంచి ఉక్రెయిన్‌కు సాయం అందుతుందనే హామీ లభించినట్లు జెలెన్స్కీ తెలిపారు.






