ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ జో రూట్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో కొత్త రికార్డు సృష్టించాడు. లండన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ సందర్భంగా అతడు 14,000 పరుగుల మైలురాయిని అతి వేగంగా అందుకున్న ఆటగాడిగా నిలిచాడు. ఈ ఘనత సాధించడంలో మాజీ భారత క్రికెటర్ సచిన్ టెండూల్కర్ రికార్డును రూట్ బ్రేక్ చేశాడు.

ఈ మైలురాయిని చేరుకోవడానికి సచిన్ టెండూల్కర్‌కు 171 మ్యాచ్‌లు పట్టగా, జో రూట్ కేవలం 164 మ్యాచ్‌ల్లోనే ఈ లక్ష్యాన్ని ఛేదించాడు. అయితే ఇన్నింగ్స్‌ల పరంగా చూస్తే సచిన్ 279 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించగా, రూట్‌కు 302 ఇన్నింగ్స్‌లు పట్టింది. ప్రస్తుతం టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక పరుగుల రికార్డు (15,921) సచిన్ పేరిట ఉండగా, ఆ రికార్డును బద్దలు కొట్టే దిశలో రూట్ శరవేగంగా ముందుకు సాగుతున్నాడు.

ఇప్పటివరకు టెస్ట్ మ్యాచ్‌ల్లో జో రూట్ 14,052 పరుగులు చేశాడు. ప్రస్తుత అతని ఫామ్ను బట్టి చూస్తే, వచ్చే రెండు మూడేళ్లలో సచిన్ రికార్డును అధిగమించడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రూట్ కొనసాగుతున్నాడు. ఇందులో భాగంగా అతడు 76 మ్యాచ్‌ల్లో 51.78 సగటుతో 6,577 పరుగులు సాధించాడు. ఆ తర్వాత స్థానంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ 4,564 పరుగులతో ఉన్నాడు.

రెండో టెస్ట్ విషయానికి వస్తే, న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 391 పరుగులు చేసింది. గ్లెన్ ఫిలిప్స్ తన తొలి టెస్ట్ సెంచరీతో కివీస్ జట్టును ఆదుకున్నాడు. దానికి ప్రత్యుత్తరంగా ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 291 పరుగులకే ఆలౌటైంది. 100 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ అద్భుతంగా రాణించి 362 పరుగులు చేసింది.

మొత్తంమీద ఆతిథ్య ఇంగ్లండ్ ముందు కివీస్ 463 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ జట్టు కాస్త తడబడుతోంది. రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసిన ఇంగ్లండ్‌కు విజయానికి ఇంకా 326 పరుగులు అవసరం. ప్రస్తుతం హ్యారీ బ్రూక్ (58), జో రూట్ (57) పోరాడుతూ క్రీజులో ఉన్నారు.