అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ వైసీపీలో గ్రూపు వార్ తీవ్రస్థాయికి చేరుకుంది. ప్రస్తుత నియోజకవర్గ కోఆర్డినేటర్ పొన్నాడ సతీష్, మాజీ జనసేన నేత పితాని బాలకృష్ణ మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఇద్దరూ బీసీ సామాజికవర్గానికి చెందిన నేతలే అయినా, పొన్నాడ మత్స్యకార సామాజికవర్గం కాగా, పితాని శెట్టిబలిజ సామాజికవర్గానికి చెందినవారు.

2019 ఎన్నికలకు ముందు జనసేన నుంచి వైసీపీలో చేరిన పితాని బాలకృష్ణకు అప్పుడు టికెట్ దక్కలేదు. దీంతో ఆయన మళ్లీ జనసేనలో చేరి ముమ్మిడివరం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తాజా సార్వత్రిక ఎన్నికల్లో పొత్తులో భాగంగా టీడీపీకి ఆ స్థానం కేటాయించబడటంతో, ఆయన మరోసారి వైసీపీలోకి వచ్చారు. నిలకడ లేని రాజకీయాల కారణంగా ఆయనకు పెద్దగా విజయం దక్కలేదని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

నియోజకవర్గంలో సామాజికవర్గాల వారీగా ద్వితీయ శ్రేణి నేతలను చీల్చి రాజకీయాలు చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. బయటకు ఇద్దరూ కలిసి ఉన్నట్లు కనిపించినా, లోపల మాత్రం ఒకరి ఎదుగుదలను మరొకరు అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. త్వరలోనే పొన్నాడ సతీష్‌కు చెక్ పెడతామని బాలకృష్ణ వర్గం ప్రచారం చేసుకోగా, నిలకడలేని రాజకీయాలు చేసేవారికి అంత సీన్ లేదని సతీష్ వర్గం ఎదురుదాడికి దిగుతోంది.

ఈ వర్గపోరు కారణంగా పార్టీ కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారని, కొందరు స్థానిక నేతలు ఈ రాజకీయాలు తమ వల్ల కాదని వైదొలుగుతున్నారని తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ పోటీ చేయడం కష్టమవుతుందని రాజకీయ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కూటమిని ఎదుర్కోవాల్సిన సమయంలో సొంత ప్రయోజనాల కోసం పరుగులు తీస్తున్నారని సోషల్ మీడియాలో కార్యకర్తలు సెటైర్లు వేస్తున్నారు.

పార్టీలోకి పార్ట్ టైమ్‌గా వచ్చి ఫుల్ టైమ్ గొడవలు పెడుతున్నారనేది క్యాడర్ మనసులోని మాట. ముమ్మిడివరం వైసీపీలో సమన్వయం లోపించిందని పార్టీ నేతలే అంగీకరించాల్సిన పరిస్థితి నెలకొంది. కోఆర్డినేటర్‌కు, ఎన్నికల ముందు వచ్చిన నేతకు మధ్య సరిగా పొసగడం లేకపోవడంతో, అంతర్గతంగా ఆధిపత్య పోరు కొనసాగుతోంది.