సోమవారం రంగిరి దంబుల్లా అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన ముక్కోణపు వన్డే సిరీస్ మ్యాచ్‌లో ఇండియా-ఎ నిర్ణీత 50 ఓవర్లలో 265 పరుగులకు ఆలౌటైంది. లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంక-ఎ కూడా 50 ఓవర్లలో 265/9 స్కోరు సాధించడంతో మ్యాచ్ టై అయింది. విజేతను తేల్చేందుకు జరిగిన సూపర్ ఓవర్‌లో శ్రీలంక 16 పరుగులు చేయగా, భారత్ 10 పరుగులకే పరిమితమై 7 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. సూపర్ ఓవర్‌లో చివరి బంతిని నోబాల్‌గా ప్రకటించడంపై తిలక్ వర్మ అంపైర్లతో వాదించినప్పటికీ, అదనపు బంతి తర్వాత శ్రీలంక విజయం సాధించింది.

మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన తిలక్ వర్మ, తాను ఎవరికీ ఉపన్యాసాలు ఇవ్వడానికి రాలేదని, కానీ 15 ఏళ్ల వయసున్న వైభవ్ సూర్యవంశీతో శ్రీలంక ఆటగాళ్లు వ్యవహరించిన తీరు తనకు అస్సలు నచ్చలేదని అన్నాడు. అక్కడ ఏం జరిగిందో పూర్తిగా తెలియకపోయినా, మ్యాచ్ ముగిసిన తర్వాత వైభవ్ ప్రశాంతంగా వెళ్తున్న సమయంలో శ్రీలంక ఆటగాళ్లే గొడవకు ప్రయత్నించారని, ఇది క్రీడా సంబంధాలకు మంచిది కాదని ఆయన అభిప్రాయపడ్డాడు. కాగా సూర్యాన్ష్, విప్రజ్ భాగస్వామ్యం, స్పిన్నర్ల ప్రదర్శన, అర్షద్ ఖాన్ డెత్ ఓవర్ల బౌలింగ్ పట్ల తిలక్ వర్మ సంతృప్తి వ్యక్తం చేశాడు.