ముంబైలో నివసించే 82 ఏళ్ల మన్సుఖ్ కాకా ప్రతిరోజూ పన్నెండు గంటల పాటు ఫుట్‌పాత్‌పై చిరుతిళ్లు లేదా ఫర్సాన్ అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు. వృద్ధాప్యంలో విశ్రాంతి తీసుకోవాల్సిన ఈయన, తన కాళ్ల మీద తాను నిలబడాలనే సంకల్పంతో ఈ చిన్న వ్యాపారాన్ని చేపట్టారు.
ముంబైలోని ఒక చీరల దుకాణంలో సేల్స్‌మ్యాన్‌గా పనిచేసిన మన్సుఖ్ కాకా, కోవిడ్-19 మహమ్మారి సమయంలో అనారోగ్యానికి గురై ఉద్యోగాన్ని కోల్పోయారు. ఆ సమయంలో ఆయనను చూసుకోవడానికి ఆయన కుమారుడు కూడా తన ఉద్యోగాన్ని వదులుకోవాల్సి వచ్చింది. కోలుకున్న తర్వాత ఇతరులపై ఆధారపడకుండా ఉండాలనే నిర్ణయంతో, సోదరి సాయంతో ఈ చిన్న వ్యాపారాన్ని ప్రారంభించారు.
మన్సుఖ్ కాకా సోదరి ఇంట్లోనే తాజాగా మురుకులు, సేవరీ వంటి ఉప్పు పిండి వంటకాలను తయారు చేసి ఇస్తే, ఆయన వాటిని ప్యాకెట్లుగా మార్చి స్టాల్‌కు తీసుకొచ్చి అమ్ముతారు. రోజుకు పన్నెండు గంటలు కష్టపడినా ఆయనకు లభించే ఆదాయం కేవలం 300 రూపాయలు మాత్రమే. అయినప్పటికీ విచారించకుండా, ఒక చిన్న డైరీలో ఖర్చులు, అమ్మకాల లెక్కలు రాసుకుంటూ నిబ్బరంగా పనిచేస్తున్నారు.
ముంబైకి చెందిన కంటెంట్ క్రియేటర్ ఆరాధన ఛటర్జీ ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో రూపంలో పంచడంతో మన్సుఖ్ కాకా కథ విస్తృతంగా వ్యాపించింది. నీట్‌గా షర్టు ధరించి, చిరునవ్వుతో కస్టమర్లను ఆదరించే ఈయన వినమ్రత, దయాగుణంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ముంబై ప్రజలు ఆయన స్టాల్‌కు వెళ్లి స్నాక్స్ కొనుగోలు చేసి ఆయనకు మద్దతు ఇవ్వాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.








