హైదరాబాద్ లోని సైదాబాద్ ప్రాంతానికి చెందిన 65 ఏళ్ల ప్రైవేట్ స్కూల్ టీచర్ యూట్యూబ్ చూస్తుండగా కనిపించిన ఒక ప్రకటనపై క్లిక్ చేసి రూ.3.92 లక్షలు కోల్పోయారు. ఆ ప్రకటనలో కనిపించిన రీడింగ్ గ్లాసెస్ ను కొనుగోలు చేయాలని భావించి, సంబంధిత లింక్ ద్వారా వెబ్ సైట్ కు వెళ్లి ఆర్డర్ పెట్టారు. అయితే 'ఇకార్ట్' కొరియర్ సర్వీస్ ద్వారా వచ్చిన పార్సెల్ లో ఆయన ఎంచుకున్న తెలుపు రంగుకు బదులుగా నల్ల రంగు గ్లాసెస్ ఉన్నాయి.
రంగు తేడాతో ఆర్డర్ ను మార్చుకోవాలనుకున్న బాధితుడు, చాట్ జీపీటీ (కృత్రిమ మేధస్సుతో పనిచేసే యాప్)లో ఇకార్ట్ కస్టమర్ కేర్ హెల్ప్ లైన్ నంబర్ కోసం వెతికారు. అక్కడ దొరికిన నంబర్ కు కాల్ చేయగా, అవతలి వ్యక్తి ఆర్డర్ నంబర్, డెలివరీ ఐడీ వివరాలు తీసుకుని సమస్యను పరిష్కరిస్తామని నమ్మబలికాడు. అనంతరం కస్టమర్ కేర్ ప్రతినిధిగా నటిస్తూ ఒక వ్యక్తి వాట్సాప్ ద్వారా 'Customer Support.apk' పేరుతో ఒక అప్లికేషన్ ఫైల్ ను పంపాడు.
నిజమైన సహాయక బృందం అని నమ్మిన ఆ టీచర్, ఆ ఫైల్ ను తన మొబైల్ ఫోన్ లో ఇన్ స్టాల్ చేసి ఓపెన్ చేయగానే సైబర్ నేరగాళ్లు క్షణాల్లో ఆయన బ్యాంక్ ఖాతా నుంచి రూ.3.92 లక్షలు కాజేశారు. ఖాతా నుంచి డబ్బు మాయం కావడాన్ని గమనించిన బాధితుడు వెంటనే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఈ ఘటన నేపథ్యంలో పోలీసులు ప్రజలకు కీలక హెచ్చరికలు జారీ చేశారు. గూగుల్ లేదా ఏఐ టూల్స్ లో దొరికే కస్టమర్ కేర్ నంబర్లను గుడ్డిగా నమ్మవద్దని, గుర్తుతెలియని వ్యక్తులు వాట్సాప్ లో పంపే ఏదైనా .apk ఫైళ్లను ఫోన్లలో ఇన్ స్టాల్ చేయకూడదని సూచించారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఏవైనా అనుమానాలు కనిపిస్తే వెంటనే పోలీసులను ఆశ్రయించాలని కోరారు.








