టాలీవుడ్ పవర్ స్టార్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నటిస్తున్న 'ఓజీ' (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) సినిమా సీక్వెల్‌పై అధికారిక ప్రకటన వెలువడింది. పవన్ కల్యాణ్ గతంలో ఇచ్చిన హామీ మేరకు 'ఓజీ యూనివర్స్' విస్తరణకు సంబంధించిన చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ విషయాన్ని చిత్ర నిర్మాతలు సోషల్ మీడియా వేదికగా తెలియజేయడంతో నెట్టింట '#ఓజీ2' హ్యాష్ ట్యాగ్ విస్తృతంగా వ్యాపించింది.
ఈ క్రేజీ చర్చల్లో దర్శకుడు సుజీత్, హీరో పవన్ కల్యాణ్‌తో పాటు చిత్రానికి సంగీతం అందిస్తున్న తమన్ కూడా పాల్గొన్నారు. సినిమాకు సంబంధించిన కీలకమైన సన్నివేశాలు, నేపథ్య సంగీతం, సీక్వెల్ లేదా ప్రిక్వెల్ కథాంశాలపై బృందం సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం.
'ఓజీ' సినిమా చిత్రీకరణ పవన్ కల్యాణ్ రాజకీయ బాధ్యతల కారణంగా కాస్త ఆలస్యమైనప్పటికీ, 'ఓజీ 2' విషయంలో అలాంటి ఇబ్బందులు రాకుండా నిర్మాతలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. పవన్ కల్యాణ్ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ సినిమాను త్వరితగతిన పూర్తి చేయడానికి, 'ఓజీ' ప్రపంచాన్ని మరింత పెద్దదిగా చూపించడానికి సుజీత్ బృందం రంగంలోకి దిగడంతో మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
అతి త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ స్క్రిప్ట్ చర్చల వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.








