ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి మరియు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈరోజు ఓరుగల్లులో పర్యటించనున్నారు. హనుమకొండ జిల్లా హనుమాన్ నగర్ కాలనీకి చెందిన నిరంజన్ అనే 17 ఏళ్ల బాలుడిని కలిసి ఆయన ప్రత్యేకంగా మాట్లాడతారు. ఉదయం 7:30 గంటలకు హైదరాబాద్ నుండి రోడ్డు మార్గంలో బయలుదేరి, 9:45 గంటలకు ఆ బాలుడి నివాసానికి చేరుకుంటారు.
నిరంజన్ 'డ్యూచెన్ మాస్కులర్ డిస్టోపీ' అనే అరుదైన జన్యు నరాల వ్యాధితో మూడేళ్లుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. ఈ ప్రాణాంతక వ్యాధి కారణంగా రోజురోజుకు అతని ఆరోగ్యం క్షీణిస్తూ, మంచానికే పరిమితమయ్యాడు. పవన్ కళ్యాణ్‌ను చూడాలనేది ఆ బాలుడి కోరిక కాగా, ఈ విషయం సామాజిక కార్యకర్త చిలువేరు శంకర్ ద్వారా జనసేన నేతలకు, అనంతరం పవన్ దృష్టికి వెళ్లింది.
సుమారు 45 నిమిషాల పాటు నిరంజన్ మరియు ఆయన కుటుంబ సభ్యులతో పవన్ కళ్యాణ్ గడుపుతారు. ఈ సందర్శనలో ఎలాంటి రాజకీయ అంశాలు ఉండవని, కేవలం బాలుడి కోరికను నెరవేర్చడమే లక్ష్యమని జనసేన శ్రేణులు స్పష్టం చేశాయి. తమ కుమారుడిని పరామర్శించడానికి పవన్ వస్తుండటం పట్ల తల్లిదండ్రులైన రాము, మానస దంపతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
నిరంజన్‌తో సంభాషణ అనంతరం పవన్ కళ్యాణ్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని, మళ్లీ రోడ్డు మార్గంలోనే హైదరాబాద్‌కు తిరిగి వెళ్తారు. గాలి బుడగ లాంటి జీవితంతో ఉన్న ఈ బాలుడికి పవన్ పలకరింపు ఆయుస్సు నింపే సంజీవిని అవుతుందని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు.







