ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం కెవి ఆగ్రహారం గ్రామంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. కుటుంబంలో నెలకొన్న కలహాల కారణంగా సుధాకర్ అనే వ్యక్తి తన ముగ్గురు కూతుళ్లను హత్య చేసి, అనంతరం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంట్లో నుంచి ఎటువంటి శబ్దాలు రాకపోవడంతో అనుమానం చెందిన చుట్టుపక్కల వారు లోపలికి వెళ్లి చూడగా మృతదేహాలు కనిపించాయి.
సుధాకర్‌కు భార్య మరియు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. గత కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండగా, ఈ ఘర్షణలు తారాస్థాయికి చేరుకోవడంతో భార్య ముగ్గురు పిల్లలు మరియు భర్తను వదిలేసి ఇంటి నుంచి పారిపోయింది. భార్య ఇంటిని వదిలి వెళ్లిపోవడంతో సుధాకర్ తీవ్ర మానసిక ఆఘాతానికి గురై, జీవితంపై విరక్తి చెందాడు.
మానసికంగా కుంగిపోయిన సుధాకర్ తన ముగ్గురు కూతుళ్లు లోహిత, పూజిత, అచ్యుతలను చంపేసి, ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్థులు ఈ విషయాన్ని గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.






