సైబర్ నేరగాళ్లు ఓటీపీ, నకిలీ పెట్టుబడి పథకాలు, డిజిటల్ అరెస్టుల వంటి విధానాలతో ప్రజలను మోసం చేసి వారి ఖాతాల్లోని డబ్బును కాజేస్తున్నారు. ఇలా డబ్బు పోగొట్టుకున్న వారు ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా కేంద్ర హోంశాఖ మొబైల్ రిస్టోరేషన్ మాడ్యూల్ (ఎంఆర్‌ఎం) పోర్టల్‌ను ప్రారంభించింది.

ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ఆధ్వర్యంలో నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో భాగంగా ఈ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా బాధితులు ఇంటి నుంచే రీఫండ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఖాతా నుంచి తెలియకుండా డబ్బు డెబిట్ అయితే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేసి, మోసగాడి ఖాతాను స్తంభింపజేయించాలి. ఈ రెండు చర్యలు జరిగితేనే ఎంఆర్‌ఎం పోర్టల్ ద్వారా నిధులను తిరిగి పొందే అవకాశం ఉంటుంది.

స్తంభింపజేసిన మొత్తం రూ.50 వేల కంటే తక్కువగా ఉంటే ఎఫ్‌ఐఆర్ (నేరం నమోదు పత్రం) లేదా కోర్టు ఉత్తర్వు అవసరం లేదు, కేవలం పోలీసు ఫిర్యాదు ఆధారంగానే రీఫండ్ వస్తుంది. ఒకవేళ మొత్తం రూ.50 వేలు దాటితే మాత్రం ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసి కోర్టు ఉత్తర్వు పొందడం తప్పనిసరి. సిస్టమ్‌లో స్తంభింపజేసిన మొత్తాన్ని చూసి, కోర్టు ఉత్తర్వు ఉంటే దాని కాపీని అప్‌లోడ్ చేసి, డిక్లరేషన్ ఫారమ్‌కు అంగీకరించి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.