జార్ఖండ్ రాజధాని రాంచీలోని చుటియా ప్రాంతంలో ఉన్న ఆర్ఎస్ఎస్ (రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్) కార్యాలయంపై జూన్ 16 రాత్రి పెట్రోల్ బాంబులతో దాడి జరిగింది. ఈ ఘటనకు పాల్పడినట్లు గుర్తించిన సైఫ్ అన్సారీ అలియాస్ రోహిత్ అనే నిందితుడు కోత్వాలి పోలీస్ స్టేషన్ కస్టడీలో ఉన్నాడు. బాత్రూమ్‌కు వెళ్తానని చెప్పి అతడు తప్పించుకునేందుకు ప్రయత్నించగా, పోలీసులు జరిపిన ఎన్‌కౌంటర్‌లో అతడి గాలికి బుల్లెట్ తగిలి గాయపడ్డాడు. వెంటనే చికిత్స నిమిత్తం అతడిని ఆస్పత్రికి తరలించారు.

ఈ దాడిలో సైఫ్ అన్సారీతో పాటు అమన్ అన్సారీ, సయామ్ సుజన్ అనే మరో ఇద్దరు నిందితులు పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. ముగ్గురూ జార్ఖండ్‌కే చెందినవారని, ఇందులో ఒకరు రాంచీవాసి కాగా, మిగిలిన ఇద్దరు లోహార్దగా జిల్లాకు చెందినవారని తేలింది. దాడికి ముందు నిందితులు కార్యాలయం వద్ద రెక్కీ నిర్వహించి, వీడియోలు చిత్రీకరించినట్లు విచారణలో వెల్లడైంది. సోషల్ మీడియా ప్రభావంతోనే వీరు ఈ చర్యకు ఒడిగట్టినట్లు పోలీసులు భావిస్తున్నారు.

కేసు దర్యాప్తులో భాగంగా నిందితులకు పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ (ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్)తో పాటు, గ్యాంగ్‌స్టర్ షెహజాద్ భట్టి నెట్వర్క్‌తో సంబంధాలు ఉన్నాయా అనే అంశాలపై భద్రతా సంస్థలు నిశితంగా విచారిస్తున్నాయి. నిందితుల్లో ఒకరు ఆరు నెలలు దుబాయ్‌లో ఉన్నట్లు, అక్కడే అనుమానిత నెట్వర్క్‌తో పరిచయం ఏర్పడినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. అలాగే రానా సాహిబ్ అనే వ్యక్తి పెట్రోల్ బాంబుల తయారీ విధానాన్ని తెలిపే వీడియోలు పంపినట్లు విచారణలో తేలింది. ఈ కేసులో అమన్ అన్సారీనే ప్రధాన సూత్రధారి అని పోలీసులు అనుమానిస్తున్నారు.