హైదరాబాద్‌లో జరిగిన బండి భగీరథ్ పోక్సో కేసులో మైనర్ బాలికకు న్యాయం జరగడం లేదని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. మే 8న కేసు నమోదైనప్పటి నుంచి నిందితుడిని జైలుకు పంపకుండా స్టేషన్ బెయిల్ ఇవ్వాలని ప్రయత్నించారని, అయితే బీఆర్ఎస్ పోరాటం, ప్రజలు మరియు సోషల్ మీడియా ఒత్తిడితో నిందితుడిని అరెస్టు చేసి చర్లపల్లి జైలుకు పంపారని ఆయన తెలిపారు.
నిందితుడు మేడ్చల్ మల్కాజిగిరి కోర్టులో మూడు సార్లు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా కోర్టు అందుకు నిరాకరించింది. అయినప్పటికీ ఈ విషయాన్ని బాధితురాలు మరియు ఆమె తల్లికి అధికారులు తెలియజేయలేదని, బాధితురాలి తల్లి ఈ నెల 17, 18 తేదీల్లో తనతో మాట్లాడి కేసు వివరాలు చెప్పడం లేదని వాపోయారని ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. ఇన్వెస్టిగేషన్ అధికారి బిజీగా ఉంటే, కనీసం ఒక మహిళా అధికారినైనా బాధితులకు వివరాలు ఇచ్చేలా చూడాలని ఆయన డిమాండ్ చేశారు.
నిందితుడి తరపు న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్ ప్రకారం, ఆరోపితుడు 2023 నుంచి 2026 వరకు మహీంద్రా యూనివర్సిటీలో చదువుతున్నాడు. 2023లో తోటి విద్యార్థులపై దాడి చేసినందుకు సస్పెండ్ అయిన ఈ నిందితుడు, మూడు సంవత్సరాల కోర్సులో ఇప్పుడు పరీక్షలు రాయకపోతే జీవితం ఆగమవుతుందని బెయిల్ కోరుతున్నాడు. అయితే జైలు నిబంధనల (ప్రిసన్ మ్యానువల్) ప్రకారం ఖైదీలు జైలులోనే చదువుకొని పరీక్షలు రాయవచ్చని, అందువల్ల బెయిల్ అవసరం లేదని ప్రవీణ్ కుమార్ వాదించారు.
బాధితులు భయంతో కోర్టుకు లేదా పోలీసుల వద్దకు వెళ్లే పరిస్థితిలో ఉన్నారని, నిందితుడికి బెయిల్ మంజూరైన విషయాన్ని బయటి ప్రపంచానికి మరియు బాధితులకు కూడా రహస్యంగా ఉంచడంపై ఆయన ప్రశ్నించారు. బాధితురాలి స్టేట్మెంట్ వివరాలు అడిగినా అధికారులు ఇవ్వడం లేదని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధితురాలితో మాట్లాడకుండా నిందితుడిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయమై తాము హైకోర్టును ఆశ్రయిస్తామని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు.








