అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఆదివారం చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. తన జీవితంలో అత్యంత ముఖ్యమైన ఇద్దరు వ్యక్తులలో ఒకరు భారతీయురాలైన తన భార్య ఉషా కాగా, రెండవ వ్యక్తి పాకిస్తాన్ సేనాధ్యక్షుడు ఆసిమ్ మునీర్ అని ఆయన పేర్కొన్నారు.
గత మూడు నెలలుగా తాను ఆసిమ్ మునీర్‌తోనే ఎక్కువగా మాట్లాడానని, ఆయన అమెరికాకు మంచి మిత్రుడని, దక్షుడైన దౌత్యవేత్త అని వాన్స్ కొనియాడారు. స్విట్జర్లాండ్‌లో అమెరికా, ఇరాన్ మధ్య జరిగిన శాంతి చర్చల అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
భార్యను పాకిస్తాన్ సేనాధ్యక్షుడితో పోల్చడం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ సందర్భంగా వాన్స్ మాట్లాడుతూ, ఒప్పందంలోని సాంకేతిక అంశాలపై చర్చలు జరుగుతున్నాయని, అన్ని విభేదాలు పరిష్కారం కాకపోయినా అన్ని పక్షాలు ఒక జట్టుగా కూర్చోవడం ఇదే మొదటిసారని తెలిపారు.
కొన్ని గంటల పాటు సాగిన చర్చల్లో గణనీయమైన పురోగతి సాధించినట్లు ఆయన వెల్లడించారు. మధ్యప్రాచ్యంలో శాశ్వత కాల్పుల విరమణ అమలు చేయడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కట్టుబడి ఉన్నారని, లెబనాన్‌లో కాల్పుల విరమణ కొనసాగడం ద్వారా పురోగతి కనిపించిందని వాన్స్ అన్నారు.
శాంతి, శ్రేయస్సును ప్రోత్సహించేందుకు అన్ని దేశాలు కలిసి పనిచేసే భవిష్యత్తు కనిపిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యమైన సమస్యల పరిష్కారం, మెరుగైన భవిష్యత్తు దిశగా పయనించడానికి ఈ చర్చలు సహాయపడతాయని వాన్స్ పేర్కొన్నారు.








