లైఫ్ ఇన్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీ) అనే ప్రభుత్వ బీమా సంస్థ మహిళలకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు బీమా సఖి యోజనను అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా ఎంపికైన మహిళలకు మొదటి సంవత్సరంలో నెలకు 7,000 రూపాయల స్టైపెండ్ అందుతుంది. తర్వాతి రెండో ఏడాదిలో ఈ మొత్తం 6,000 రూపాయలకు, మూడో ఏడాదిలో 5,000 రూపాయలకు తగ్గుతుంది.

ఈ పథకం లక్ష్యం మహిళలకు ఇన్యూరెన్స్ ఉత్పత్తులు, బీమా సేవలు మరియు ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కల్పించి, వారిని అర్హత గల ఎల్‌ఐసీ ఏజెంట్లుగా మార్చడం. శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత పాలసీలను విక్రయిస్తే, స్టైపెండ్‌తో పాటు అదనంగా కమిషన్ కూడా పొందవచ్చు. మూడేళ్ల తర్వాత కూడా స్టైపెండ్ పొందాలంటే, ఎల్‌ఐసీ నిర్దేశించిన వ్యాపార మరియు పాలసీ లక్ష్యాలను సాధించాల్సి ఉంటుంది.

ఈ పథకంలో చేరాలంటే దరఖాస్తుదారుల వయస్సు 18 నుంచి 70 సంవత్సరాల మధ్య ఉండాలి మరియు కనీసం పదవ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ప్రస్తుతం ఎల్‌ఐసీ ఏజెంట్లుగా పనిచేస్తున్నవారు, అలాగే ఎల్‌ఐసీ ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులు మరియు బంధువులు ఈ పథకానికి అర్హులు కాదు. ఎంపిక ప్రక్రియలో భాగంగా ఐఆర్‌డీఏఐ (ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా) పరీక్షలలో ఉత్తీర్ణత సాధించడం తప్పనిసరి.

ఇంటి నుంచే ఈ ఉద్యోగాన్ని నిర్వహించవచ్చు కాబట్టి కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. అర్హత ఉన్న మహిళలు ఎల్‌ఐసీ ఇండియా అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుతో పాటు ఆధార్, విద్యార్హత ధృవపత్రాలు, చిరునామా రుజువు, పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు, మొబైల్ నంబర్ మరియు బ్యాంకు వివరాలు సమర్పించాల్సి ఉంటుంది.

దరఖాస్తులను అధికారులు పరిశీలించి, అర్హత ఉన్నవారికి ఫోన్ లేదా ఇమెయిల్ ద్వారా సమాచారం అందిస్తారు. తర్వాత శిక్షణ ప్రక్రియ ప్రారంభమై, దాని పూర్తి తర్వాత అభ్యర్థులను ఎల్‌ఐసీ ఏజెంట్లుగా నియమిస్తారు. ఇంటి వద్దనే ఉండి పాలసీల విక్రయం ద్వారా ఆదాయం పొందాలనుకునే మహిళలకు ఇది ఒక ముఖ్యమైన అవకాశం.