దేశ రాజకీయాల్లో పార్లమెంట్‌లో మూడింట రెండు వంతుల మెజారిటీ సాధించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రాంతీయ పార్టీలపై తీవ్రమైన ఆపరేషన్లు నిర్వహిస్తోంది. ఈ ఎత్తుగడల వల్ల ఆమ్ ఆద్మీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీ వంటి బలమైన పార్టీలు అధికారం కోల్పోగానే గట్టి దెబ్బతిన్నాయి. బెంగాల్ నుంచి మహారాష్ట్ర వరకు పలు రాష్ట్రాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలను ఆకర్షించి ప్రభుత్వాలను కూల్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
అయితే, 2001లో పార్టీ ఏర్పాటు నాటి నుంచి బీఆరెస్ మాత్రం ఇలాంటి అనేక ఒత్తిళ్లను ఎదుర్కొని నిలబడి ఉంది. 2004లో కాంగ్రెస్ పార్టీ మంత్రి పదవులు, కీలక శాఖల ఆఫర్లతో పాటు పది మంది ఎమ్మెల్యేలను లాక్కొని బీఆరెస్‌ను బలహీనం చేయడానికి ప్రయత్నించింది. తెలంగాణ ఏర్పడ్డాక టీడీపీ అధినేత ఓటుకు నోటు కుట్ర పన్నగా, తర్వాత బీజేపీ కూడా రహస్య ఆపరేషన్ ద్వారా ప్రభుత్వాన్ని కూల్చడానికి యత్నించి విఫలమైంది.
2023 ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీ పది మంది ఎమ్మెల్యేలను ఆకర్షించి బీఆరెస్ పని అయిపోయిందని ప్రచారం చేసింది. కానీ, పది మందికి మించి ఎమ్మెల్యేలను గెలిపించుకోలేకపోవడంతో ఆ ప్రయత్నం ఆగిపోయింది. ఫిరాయింపుదారులు, వారిని ప్రోత్సహించినవారు ప్రజల్లో బదనాం అయ్యారు. ప్రస్తుతం ప్రత్యర్థులు కేసీఆర్, హరీశ్ రావు, కేటీఆర్ మధ్య విభేదాలు సృష్టించి పార్టీని బలహీనం చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
హరీశ్ రావుతో బీజేపీ నేతలు మంతనాలు జరుపుతున్నారనే వదంతులు మీడియాలో వ్యాపించినా, ఉద్యమకాలం నాటి నుంచి కేసీఆర్‌తో ఆయనకు ఉన్న బంధాన్ని విడదీయడం సాధ్యం కావడం లేదు. వ్యక్తుల మీద కాకుండా తెలంగాణ అనే అంశం మీద, ప్రాంతీయ భావోద్వేగాలపై నడుస్తున్న పార్టీ కాబట్టి దీనిని ముట్టుకోవడం ప్రత్యర్థులకు కష్టంగా మారింది. అధికారం ఉన్నా లేకపోయినా విచ్ఛిన్నం కాకుండా ఉన్న ఏకైక పార్టీగా బీఆరెస్ నిలిచింది.








