భద్రాద్రి జిల్లా గుండాల మండలం శంభునిగూడెం గ్రామానికి చెందిన చాట్ల వనజ అలియాస్ మమత అనే గర్భిణి జూన్ 13న ప్రసవం కోసం గుండాల ప్రభుత్వ ఆస్పత్రిలో చేరింది. ఆ సమయంలో ఆస్పత్రిలో డాక్టర్లు ఎవరూ అందుబాటులో లేకపోవడంతో, అక్కడ ఉన్న నర్సు స్వయంగా కత్తెరతో ప్రసవం చేయించింది. ఈ నిర్వాకం వల్ల పుట్టిన శిశువు అక్కడికక్కడే మృతి చెందగా, తల్లి పరిస్థితి విషమించడంతో ఆమెను ముందు కొత్తగూడెం జిల్లా ఆస్పత్రికి, అనంతరం మెరుగైన వైద్యం కోసం ఖమ్మంకు తరలించారు.

ఖమ్మంకు వెళ్లే మార్గమధ్యంలోనే ఆ తల్లి కూడా ప్రాణాలు కోల్పోయింది. ఒకే రోజు తల్లిబిడ్డలిద్దరూ మృతి చెందడంతో స్వగ్రామంలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అయితే అంత్యక్రియలు ముగించి బంధువులు చితాభస్మం సేకరిస్తుండగా, అందులో కాలిన శస్త్రచికిత్స కత్తెర బయటపడింది. దీంతో నర్సు నిర్లక్ష్యంగా కత్తెరను బాలింత కడుపులోనే వదిలేసి కుట్లు వేశారని, దానివల్లే తీవ్ర రక్తస్రావం జరిగి మృతి సంభవించిందని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు.

మరోవైపు వైద్యాధికారులు మాత్రం అక్కడ శస్త్రచికిత్స ఏమీ జరగలేదని, అది సాధారణ ప్రసవమేనని చెప్పుకుంటూ బాధ్యత నుండి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. డాక్టర్లు లేని సమయంలో అర్హత లేని సిబ్బంది చేసిన ఈ వైద్యం ఇద్దరి ప్రాణాలు తీసిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధ్యులైన నర్సు మరియు వైద్య సిబ్బందిపై కఠిన విచారణ జరిపి, హత్య కేసు నమోదు చేయాలని మృతురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.