దశాబ్దాలుగా శ్రోతలను అలరిస్తున్న గాయని కె.ఎస్.చిత్ర, రికార్డింగ్ స్టూడియోకు వెళ్లేటప్పుడు తనలో తెలియని భయం, టెన్షన్ ఉంటాయని ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. మంచి పాట పాడటానికి వెళ్లేటప్పుడు గాయకుల్లో ఉత్సాహం ఉంటుందని అనుకుంటారు కానీ, తన విషయంలో మాత్రం సంతోషం కంటే బాధ్యత, భయమే ఎక్కువగా ఉంటుందని ఆమె వివరించారు.

తన కెరీర్‌లో అందరు అగ్ర కంపోజర్లతో పనిచేసినప్పటికీ, మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా, ప్రముఖ కంపోజర్ శరత్ దగ్గరకు వెళ్లేటప్పుడు మాత్రం ప్రత్యేకంగా భయపడేవారని చిత్ర ఒప్పుకున్నారు. ముఖ్యంగా శరత్ స్వరపరిచిన కంపోజిషన్స్ చాలా క్లిష్టంగా ఉంటాయని, ఆయన ఇచ్చే ట్యూన్స్, నోట్స్ అర్థం చేసుకోవడానికే గాయకులకు ఒక్కోసారి ఒక రోజంతా సమయం పడుతుందని ఆమె నవ్వుతూ చెప్పారు.

'సింధూర రేఖ' సినిమాలో శరత్ సంగీత దర్శకత్వంలో వచ్చిన 'ప్రణతోస్మి గురువాయుపురేశా' పాట విషయంలో తనకు బేసిక్ 'సా' (శృతి) ఎక్కడ ఉందో, నోట్స్ ఎటువైపు వెళ్తున్నాయో మొదట్లో అర్థం కాలేదని చిత్ర గుర్తుచేసుకున్నారు. ఆ క్లిష్టమైన క్లాసికల్ నోట్స్‌ను స్వరాలుగా కాగితంపై రాసుకుంటున్నప్పుడు చాలా టెన్షన్ కలిగిందని, ఆ పాటను తాను ఇప్పటికీ ఎలా పాడగలిగానో తనకే అర్థం కాదని ఆమె వినమ్రంగా అన్నారు.